“మనది మంగళవారం.. మందిది సోమవారమా?
– *టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు
*పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్, కేటీఆర్ వైఖరిపై విమర్శలు*
ప్రజా గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు పార్టీ ఫిరాయింపులపై బిఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఆయన కుమారుడు కేటీఆర్ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గురువారం షాద్‌నగర్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ, “మనది మంగళవారం.. మందిది సోమవారం” అన్నట్లు తండ్రి కొడుకులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
*బిఆర్‌ఎస్ పాలనపై ఘాటుగా:*
“ఫిరాయింపులపై నేడు మొసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్, కేటీఆర్ గతంలో టీడీపీ ఎమ్మెల్యే తలసానిని మంత్రిగా చేసేటప్పుడు ఎందుకు స్పందించలేదు?” అని ప్రశ్నించారు.2019లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎటు పోయిందో ఇప్పుడు చెప్పాలని డిమాండ్ చేశారు.అధికార మదంతో ప్రతిపక్ష హోదా సైతం లేకుండా అప్పటి శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్కకు అన్యాయం చేశారన్నారు.”దళితుని సీఎం చేస్తానన్న కేసీఆర్ అసలు శాసనసభలో దళితుని ప్రతిపక్ష నేతగా కూడా చూడలేకపోయారు,” అని ధ్వజమెత్తారు.
*బిఆర్‌ఎస్ స్టాండ్ పై హాస్యాస్పద వ్యాఖ్యలు*
“ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి విఘాతం అని వేదాలు వల్లించడమేంటీ?” అని ఎద్దేవా చేశారు.”మనకు ఒక న్యాయం, మందికి మరో న్యాయం ఉండకూడదు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి,” అని స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీని తెలంగాణలో అణిచివేసే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు అదే దుర్మార్గాలు కేసీఆర్‌ను వెంటాడుతున్నాయి,” అన్నారు.
*ప్రభుత్వ పాలనపై హెచ్చరిక*
“అధికారం ఎవరికి శాశ్వతం కాదు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.””తప్పుడు చర్యలు భవిష్యత్తులో ప్రతిఫలం చూపుతాయి,” అని బక్కని నర్సింహులు హెచ్చరించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పాలనను దుయ్యబట్టిన బక్కని, తెలంగాణలో టీడీపీ తిరిగి పునాదులు పటిష్ఠం చేసుకోవాలని తమ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.