చిన్నఅరుణాచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామాలయం పుణ్యక్షేత్రంగా ఎంత ప్రాచుర్యం పొందిందో, అదే విధంగా పర్ణశాల కూడా భక్తుల విశ్వాస కేంద్రంగా వెలుగొందుతోంది. శ్రీరామ చరిత్రలో ప్రాముఖ్యత గల ఈ ప్రదేశం భద్రాచల రామదాసు కాలం నుండి భక్తులకు పవిత్రతను ప్రసాదిస్తోంది. పర్ణశాల తన పురాణ ఘనతతో ప్రసిద్ధి చెందగా, ఇప్పుడు దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం గ్రామంలో ఉన్న చిన్న అరుణాచలం భక్తుల ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. భద్రాచలం నుండి పర్ణశాల మార్గంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్ర విశిష్టత ఏమిటంటే భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలను ఒక్కచోటే దర్శించుకునే అరుదైన అవకాశం భక్తులకు ఇక్కడ లభిస్తుంది. భక్తులు స్వయంగా 12 జ్యోతిర్లింగాలకు అభిషేకాలు చేసే బృహత్కర కార్యక్రమంకు ఏర్పాట్లు చేశారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళలేని భక్తులు చిన్నఅరుణాచలం సందర్శిస్తే ఆ అనుభూతిని పొందవచ్చు అందుకే భక్తులు అధిక సంఖ్యలో చిన్నఅరుణాచల క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగాఅలయ వ్యవస్థాపకుడు శివనాగ స్వామి మాట్లాడుతూ ఈ శివరాత్రి సందర్భంగా భక్తులకు స్వామివారి కృప అందేలా అన్ని ఏర్పాట్లు చేశాం. చిన్న అరుణాచలం ఆలయానికి భక్తులు పెద్ద పెద్ద సంఖ్యలో తరలిరావడం ఆనందదాయకం.ఈ పవిత్ర క్షేత్రంలో శివుని సేవ చేయడం మానవ జన్మకు కలిగిన గొప్ప భాగ్యం అని అన్నారు.