పర్ణశాల అభివృద్ధికి జిల్లా కలెక్టర్ పలు సూచనలు
.ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పర్ణశాల దేవస్థానాన్ని సందర్శించారు. భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పర్ణశాల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్, దేవస్థానం అభివృద్ధికి పలు కీలక సూచనలు చేశారు.ఆలయ ప్రాంగణం మొత్తం ఔషధ మొక్కలు, ముఖ్యంగా తులసి మొక్కలను విరివిగా నాటాలని కలెక్టర్ సూచించారు. ఈ మొక్కల ఏర్పాటుకు దేవస్థానం నిర్దేశించిన ప్రదేశాన్ని తనిఖీ చేసి, పంచాయతీ వారి సహకారంతో తక్షణమే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు.అదేవిధంగా, పర్ణశాల ఆలయం రహదారి పూర్తిగా షాపులతో కిక్కిరిసిపోయిన భద్రతా సమస్యలకు దారితీసే పరిస్థితి ఉందని గుర్తించిన కలెక్టర్,అప్రతికూల ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రద్ధ వహించవలసిందిగా పంచాయతీ మరియు దేవస్థానం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆలయం వద్ద విప్ప పువ్వులు అమ్ముతున్న వ్యాపారుల వద్ద ఆగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆత్మీయంగా పువ్వులు కొనుగోలు చేస్తూ వారికి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి, పర్ణశాల ఆలయ ఇన్చార్జి అనిల్ కుమార్, పంచాయితీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.